నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ పూర్తయింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో వెలుగు చూసిన భూ కుంభకోణం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని నిర్ధారణ అయింది. దొంగ సర్వే నంబర్లు సృష్టించడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడం.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) కోసం రిజిస్ట్రేషన్‌కు పంపడంలోనూ అధికారుల పాత్ర ఉందని తేలింది. దీనిపై పూర్తి నివేదికను సిద్ధం చేసిన గూడూరు ఆర్డీవో వి.మురళీకృష్ణ.. కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు అందజేశారు.
చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం గ్రామ పరిధిలో సర్వే నంబరు 94-3లో దేవాదాయశాఖకు చెందిన 271.80 ఎకరాల భూమి ఉంది. దీన్ని గతంలో పోర్టుకు ఇచ్చి పరిహారం పొందారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ అడంగల్‌లోనూ డైరెక్టర్ ఆఫ్ పోర్టు పేరు మీదనే ఉన్నాయి. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి.. ఈ భూముల్లో 209.25 ఎకరాలు 11 మంది వ్యక్తుల పేరిట అడంగల్ నమోదు చేయడంపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు’ ఆర్డీవో వి.మురళీకృష్ణ తెలిపారు. చిల్లకూరు తహసీల్దారు కార్యాలయంలో సిబ్బందితో పాటు.. ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న అప్పటి చిల్లకూరు తహసీల్దారు గీతావాణిని విచారణ చేశామన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ నవీన్.. తహసీల్దారు చెబితేనే తాను చేశానని చెబుతుండగా- గీతావాణి మాత్రం అతడు ఉత్తర్వుల్లో రెండో పేజీని మార్ఫింగ్ చేసినట్లు చెబుతున్నారని తెలిపారు.
తహసీల్దారు అనుమతి లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఆన్‌లైన్‌లో ఏ మార్పు చేయడం సాధ్యం కాదని ఆర్డీవో వి.మురళీకృష్ణ అంటున్నారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో పాటు.. బయోమెట్రిక్(చేతి వేలి గుర్తు) వేస్తేనే వెబ్‌సైట్ తెరచుకుంటుందన్నారు. ఈ విషయంలో తహసీల్దారు గీతావాణితో పాటు.. సూపరింటెండెంట్ సిరాజ్, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్‌ల పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ వ్యవహారానికి సంబంధించి రెండు లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. వీరిపై చర్యలకు కలెక్టర్‌కు నివేదించినట్లు ఆర్డీవో వి.మురళీకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: