No Facilities: పేరుకు నగర పరిధే కానీ, వసతులు పల్లెల కన్నా ఘోరం. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ శివారు ప్రాంతాల్ని కలిపేసుకోవడం వరకే ప్రభుత్వ హడావుడి. ఆ తర్వాత కాలనీలు మునిగినా పట్టించుకోరు. దోమలు దండెత్తినా.. ఎవరూ ఆలకించరు. రోడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యాలు లేక నెల్లూరు శివారు కాలనీలు సమస్యలతో సతమతమవుతున్నాయి.
సుమారు తొమ్మిది లక్షల జనాభా ఉన్న నెల్లూరు నగరంలో 54డివిజన్లు ఉండగా, అందులో సగం శివారు కాలనీలే. ఇక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలుస్తోంది. డ్రైనేజీలు లేక మురుగు పేరుకుపోతోంది. ఎన్నిసార్లు మొత్తుకున్నా.. అరణ్యరోదనే అవుతోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవటం లేదని అంటున్నారు.
శ్రామిక నగర్, చంద్రబాబు నగర్, కొత్తూరు, కావేరి నగర్,. వైయస్ఆర్ కాలనీ, జనార్ధనరెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ, సుందరయ్య కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు నీట మునిగిన రహదారులతో అవస్థలు పడుతున్నారు. ఇళ్ల చుట్టూ మురికినీరు చేరి ఉండలేకపోతున్నారు. పన్నులు తప్ప తమ పాట్లు పట్టడం లేదని మండిపడుతున్నారు. మురుగు నీరు పారేదారిలేక దుర్గంధంతోపాటు దోమల బెడద పెరిగిందని.. శివారు కాలనీ వాసులు వాపోతున్నారు. పిల్లలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: