నెల్లూరు నగరంలోని పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు స్థానిక ప్రజలు పార్కులకు వెళ్లి సేద తీరుతున్నారు. చల్లదనం కోసం సాయంత్రం వేళల్లో కుటుంబ సమేతంగా వెళ్తూ ఉత్సాహాంగా గడుపుతున్నారు.
బహుళ అంతస్థుల భవనాలు...పెరుగుతున్న జనాభాతో నెల్లూరు నగరం ఇరుకుగా మారింది. నగరం చుట్టూ ఎక్కడా చెట్లు కనిపించని పరిస్థితి. ఓ వైపు భానుడి భగభగలకు తోడు వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో నిర్మించిన పార్కులు ప్రజలకు చల్లదనాన్ని పంచుతున్నాయి. నగరంలోని ప్రధాన రోడ్డు మార్గంలో అనేక పార్కులు అభివృద్ధి చేశారు. సండే మార్కెట్, మాగుంట లేఅవుట్ రోడ్డు, బైపాస్ రోడ్డు, స్టోనస్ పేటలో ఉన్న అనేక పార్కుల్లో సేదతీరేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తున్నారు.
ప్రతి పార్కులోనూ చిన్నారులకోసం ప్రత్యేకంగా ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో క్రికెట్ వంటి ఆటలు ఆడుతూ పిల్లలు మానసిక ఉల్లాసం పొందుతున్నారు. జిమ్లో ఉండే సామగ్రి కూడా అందుబాటులో ఉండటంతో పార్కుల్లోనే కసరత్తులు చేస్తున్నారు యువకులు.