సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం సృష్టించింది. నెల్లూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచి వైకాపా అభ్యర్ధులు విజయం వైపు దూసుకుపోయారు. ఎవరూ ఊహించని విధంగా ప్రతి రౌండ్లోను ఆధిక్యం కనబర్చారు.
నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజవర్గాలు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. 2014ఎన్నికల్లో ఏడు వైకాపా, మూడు తెదేపా కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో తెదేపా ఆ స్థానాలను కూడా నిలుపుకోలేకపోయింది. పది నియోజకవర్గాల్లోనూ వైకాపా అభ్యర్థులే విజయం సాధించారు.
నెల్లూరు నగరం నుండి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు గ్రామీణంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మకూరులో మేకపాటి గౌతం రెడ్డి, కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
మొదట నెల్లూరు నగరం ఫలితాలు వెలువడతాయని భావించినా.. లెక్కింపు ఆలస్యంగా జరగడం, ప్రతి రౌండ్లోనూ వైకాపాకు స్వల్ప మెజార్టీ వచ్చింది. చివరివరకు కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగినా చివరికి మంత్రి నారాయణ స్వల్ప తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో వైకాపా విజయం సాధించింది. సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరులో వరప్రసాద్, వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి, సూళ్లూరుపేటలో కలివేటి సంజీవయ్య ఘన విజయం సాధించారు.
వైకాపాకు చెందిన ఇరువురు పార్లమెంట్ అభ్యర్ధులు గెలిచారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బల్లి దుర్గాప్రసాద్, నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.