Udayagiri MLA Mekapati comments : తాను త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తనతోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ లో చేరతారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరు విడిది కేంద్రంలో నారా లోకేశ్ ను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.
లోకేశ్ పాదయాత్ర మరో రెండు రోజుల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరిలోకి ప్రవేశించనున్న తరుణంలో... స్వాగతం పలికి యాత్రను దిగ్విజయం చేయడానికి తాను ఇక్కడికి వచ్చి కలిశానని మేకపాటి మీడియాతో అన్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ ఇస్తే.. పోటీ చేసి గెలిచి తీరుతారని, ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగుతారని మేకపాటి వ్యాఖ్యానించారు. టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డిని ఐదుసార్లు కలిసినా ఆయన స్పందించకుండా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడంతో ఇక లాభం లేదనే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు మేకపాటి తెలిపారు.
పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కి సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను. కలిసి సంఘీభావం తెలిపాను. ఇక్కడ అన్ని రకాలుగా గౌరవం దొరికింది. నాతో పాటు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నాం. పాదయాత్ర రేపటి నుంచి నా నియోజకవర్గంలో జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆయన నియోజకవర్గంలో పాదయాత్రను రిసీవ్ చేసుకుంటామని చెప్పారు. నా నియోజకవర్గంలో నేను రిసీవ్ చేసుకుంటాను. ఇక్కడ దక్కిన మర్యాదకు తగినటువంటి కష్టం పడి టీడీపీకి సహకరిస్తాను. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఐదు సార్లు కలిశాను. కానీ, వేరే వ్యక్తిని చూస్తున్నాం.. నీకు కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తాం అని మొఖం మీదనే చెప్పడం చాలా బాధగా అనిపించింది. - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
లోకేశ్‌తో భేటీ.. నెల్లూరు జిల్లా ఉదయగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. యువ గళం పాదయాత్రలో భాగంగా బద్వేలు నియోజక వర్గంలోని అట్లూరు విడిది కేంద్రానికి నారా లోకేశ్ చేరుకోగానే ఆయనతో భేటీ అయ్యారు. బద్వేలు తెలుగుదేశం నేతలతో కలిసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లోకేశ్ ను కలిశారు. బద్వేలు పాదయాత్ర ముగియగానే నెల్లూరు జిల్లా ఉదయగిరిలోకి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చాలాసేపు చర్చ జరిగింది. ఇటీవలే అధిష్టానం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన నారా లోకేశ్ ను ఈరోజు కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది.