నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం, పట్టణాల్లో పారిశుద్ద్యం పడకేసింది. ఏటా నగర, పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం మెరుగుదల పనులకు రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ప్రధాన ప్రాంతాలతో పాటు వీధులు, రహదారుల వెంట ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించే కార్యక్రమం నామమాత్రంగా నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజుల పాటు చెత్త నిల్వలు అలాగే ఉండిపోతుండగా మరికొన్నిచోట్ల పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. ఈ చెత్త కుప్పలే దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో దోమల ఉద్ధృతి పెరుగుతోంది. విచ్చలవిడిగా సంచరించే పందులు ఇక్కడే నివాసాలు ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇంత తీవ్ర పరిస్థితుల్లో సాధారణ రోజుల్లో జరిగే మొక్కుబడి తంతుతోనే సరిపెడుతున్నారు. ఏ ఒక్క పట్టణంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
రూ.లక్షలు వెచ్చిస్తున్నా..
నగరం, పట్టణాలను పరిశుభ్రంగా కనిపించేలా పారిశుద్ధ్య పనులకు పురపాలక సంఘాలు రూ.లక్షల్లో ఖర్చు పెడుతున్నాయి. జిల్లా మొత్తం మీద అన్ని రకాలుగా కలిపి రూ.40 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, దోమల నిర్మూలనకు క్రిమిసంహారక మందులు వంటివి కొనుగోలు చేస్తుంటారు. వీటికి దస్త్రాల్లో రూ.లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపిస్తున్నారు. ఈమేరకు వినియోగించిన దాఖలాలు కనిపించడం లేదు. పట్టణాల్లోని ముఖ్య ప్రాంతాలు, వీధుల్లోనూ చల్లిన దాఖలాలు లేవు. ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో మాత్రం హడావుడిగా కాస్త చల్లుతుంటారు. ఆయా ప్రాంతాల్లో కనీస నిర్మూలన చర్యలు చేపట్టాలనే ఆలోచన చేయటం లేదు. చేపలు, మాంసం, ఇతర మార్కెట్ ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. దోమల నిర్మూలన కార్యక్రమమైతే ఒకటీ. రెండు పురపాలక సంఘాలు మినహా మిగిలినవన్నీ పూర్తిగా వదిలేశాయి. పారిశుద్ధ్య పనులకు ఉపయోగించే చీపుర్లు, పారలు, ఇతర సామగ్రి నామమాత్రంగానే కనిపిస్తుంటాయి. అవి కూడా నాసిరకం పరికరాలే. వీటికి పురపాలక సంఘాలు మాత్రం రూ.లక్షలు వెచ్చించి పెద్దఎత్తున కొనుగోలు చేసినట్లు చూపుతుంటాయి.
కదలని చెత్త
అన్ని పట్టణాల్లో చెత్త పరిష్కారం కాని సమస్యగా మారింది. చెత్త వేసేందుకు డంపింగ్ యార్డులు లేవు. ప్రస్తుత స్థలాల్లో చెత్త కొండలా పేరుకుపోయింది. ఆయా ప్రాంతాల్లో రోజువారీ ఇళ్ల నుంచి సేకరించే చెత్తని మరోచోటకు తరలించే చర్యలు చేపట్టకపోవడంతో రోజురోజుకీ పెరిగిపోతోంది. డంపింగ్ యార్డులకు అవసరమైన స్థల సేకరణలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులకు స్థానికులు అడ్డగింపు వంటి కారణాలతో కార్యరూపం దాల్చలేకపోతున్నాయి. ఆ స్థలాల్లో రోజువారీ చెత్త వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరం, పట్టణ ప్రాంతాల్లో కొందరు సిబ్బంది చెత్తను నివాసాల మధ్య ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. కొన్ని చోట్ల పంట కాలువలు, రహదారుల వెంట చెత్త నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోతున్నాయి.
జిల్లాలో నగరం, పట్టణాలు : 7
జనాభా : 11 లక్షలు
ప్రతి రోజూ సేకరిస్తున్న చెత్త : 500 టన్నులు
ఏటా ఖర్చు : రూ.40 కోట్లు
పారిశుద్ధ్య కార్మికులు : 1,800
ఇది చదవండి: హెచ్చరిక: ఆహార సంక్షోభం రాబోతోంది!