నెల్లూరులో సంచలనమైన బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. దాదాపు రూ.76 లక్షల విలువైన 1,525 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని అధ్యక్షంవారి వీధిలో నివాసముంటున్న బంగారు వ్యాపారి సంజయ్ కుమార్ షా ఇంట్లో ఈ నెల 12వ తేదీన చోరీ జరిగింది. 1525 గ్రాముల బంగారాన్ని లాకర్లో పెట్టాలని సంజయ్ తన గుమస్తాకు అప్పగించాడు. 13వ తేదీన లాకర్లో నగలు కనిపించకపోవటంతో గుమస్తాపై అనుమానంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీలో గుమస్తా పాత్ర లేదని నిర్ధారించారు. బెంగళూరుకు చెందిన శశాంక్ ఆనంద్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం వ్యాపారి వద్ద డ్రైవర్‌గా చేరి.. నమ్మకంగా ఉంటూ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు శశాంక్ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పది రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అభినందించారు.