రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో నెల్లూరు ఒకటి. ఉపాధి, విద్యావకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు వలస వచ్చిన కారణంగా.. నెల్లూరు నగరం విస్తరిస్తోంది. జనాభా పెరుగుతోంది. 54 డివిజన్లలో 8 లక్షలకుపైగా జనాభా నివసిస్తున్నారు. వారికి చక్కని వాతావరణం అందించేందుకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
నగరంలో పచ్చదనం ప్రమాదకరస్థాయిలో కనుమరుగవుతోంది. నిధులు ఖర్చు చేసి మొక్కలు నాటుతున్నా... కొద్ది రోజుల్లోనే అవన్నీ ఎండిపోతున్నాయి. పార్కులు ఉండాల్సిన చోట చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి అధికారులు మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. స్మార్ట్‌సిటీ నిర్మాణంలో భాగంగా... 11 వందల కోట్ల రూపాయలతో గత మూడేళ్లుగా రహదారులు, మురుగుకాలువల పనులు సాగుతూనే ఉన్నాయి.
వాటి కోసం అస్తవ్యస్తంగా నిర్మాణాలు చేయడం, మరికొన్ని పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం వల్ల కాలుష్యం మరింత పెరిగింది. ప్రైవేటు బస్సులు, ఆటోలతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యంతో అల్లాడిపోతున్నామని స్థానికులు తెలిపారు.
నగర శివార్లలో చెత్తను, టైర్లను కాల్చడం వల్ల వచ్చే పొగకు... థర్మల్ ప్లాంట్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు కలవడంతో నగరాన్ని ఓ రకమైన పొగ కమ్మేస్తోంది. వీటికి తోడు తాగునీటి కాలుష్యం పెరిగి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మూడు నెలలకోసారి సమావేశమయ్యే కాలుష్య నియంత్రణ కమిటీ మొక్కలు నాటడం, రోడ్లు ఊడ్చడం, మట్టి రోడ్లపై ట్యాంకర్లతో నీటిని చల్లడం వంటి నిర్ణయాలు తీసుకున్నా ...అధికారులు వాటిని అమలు చేయకపోవడం వల్ల... కాలుష్య నగరాల జాబితాలో ఏటా నెల్లూరు దర్శనమిస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి: