Nara Lokesh Released the Documents on YCP MLA Anil Land Scams: నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాజకీయాల్లోకి వచ్చాక అనిల్ కుమార్ యాదవ్ అవినీతి, అక్రమాలకు పాల్పడి కొన్ని కోట్ల రూపాయలు వెనకేశాడని మంగళవారం నెల్లూరు నగరంలో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి ఎమ్మెల్యే అనిల్ స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కాకుండా ఒక్క రూపాయి ఎక్కువున్న దేవుడు తనని క్షమించడని.. ఈ విషయంపై తిరుపతి ఏడుకొండలవాడి సన్నిధిలో ప్రమాణం కూడా చేస్తానని.. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అనిల్ సవాల్ చేశారు. అయితే అనిల్ సవాల్ చేసిన ఒక్కరోజు లోపే.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను లోకేశ్ విడుదల చేశారు.
ఆధారాల వివరాలు: మాజీ మంత్రి అనిల్ భూ అక్రమాలు, బినామీల పేరుతో చేసిన భూదందాలకు సంబంధించిన ఆధారాలు ఇవిగో అంటూ నారా లోకేశ్ డాక్యుమెంట్లు విడుదల చేశారు. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాల పొలం ఉందని దాని విలువ 10 కోట్ల రూపాయలని పేర్కొన్నారు.
నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు, విలువ 100 కోట్లని వెల్లడించారు. ఇనుమడుగు సెంటర్లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు, వాటి విలువ 10 కోట్లని తెలిపారు. ఇస్కాన్ సిటీలో బినామీల పేర్లతో 87 ఎకరాలు, విలువ 33 కోట్లని అన్నారు. అల్లీపురంలో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు, విలువ 105 కోట్లని, ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి ఉందని లోకేశ్ పేర్కొన్నారు.
సాదరపాళెంలో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు, విలువ 48 కోట్లని అన్నారు. ఒక పెద్ద కాంట్రాక్టర్ నుంచి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవికి కోట్ల రూపాయలు వచ్చాయని ఆరోపించారు. బృందావనంలో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు, విలువ 25 కోట్లని, దామరమడుగులో బావమరిది పేరుతో 5 ఎకరాలు, విలువ 4 కోట్లని తెలిపారు. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేశాడని, 40 ఎకరాల్లో లే అవుట్ వేశారన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా జగన్ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలతో రూపొందించిన పుస్తకాన్ని నారా లోకేశ్ విడుదల చేశారు.