నిరసనకు దిగిన నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు.. నిరవధిక సమ్మెకు వెళ్తామంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నగరంలో 54 డివిజన్లు.. 8 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. 1,500 మంది పారిశుద్ద్య కార్మికులు నిరంతరం పనిచేస్తుంటారు. కొవిడ్ పరిస్థితుల్లో ఆరునెలలుగా అలుపెరగకుండా శ్రమించారు. సేవలను కొనియాడారే కానీ.. తిన్నారా లేదా అని ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వారు మండిపడ్డారు. కొందరికి ఆరు, మరికొందరికి ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్దిరోజులుగా అధికారులకు సమస్యను విన్నవిస్తున్నా.. పట్టించుకోలేదని కార్మికులు వాపోయారు. జీతం తీసుకోకుండా నెల గడపితే తమ అవస్థలు అర్థమవుతాయంటూ మండిపడ్డారు. ప్రతి నెలా 12,000 రూపాయలు నగర పాలక సంస్థ చెల్లిస్తుండగా.. ఆరు నెలల నుంచి నిలిపివేసిందన్నారు. కిరాణా దుకాణదారులు సైతం అప్పు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యపై ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. లేకుంటే రేపటి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. అదనపు పనిభారం తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: