ఎదిగిన కొడుకు నిద్రలోనే మరణించాడు. లేపేందుకు ప్రయత్నించగా స్పందన లేకపోవడంతో ఆ తల్లి అక్కడే కుప్పకూలిపోయింది. శవాన్ని ఇంట్లోనే ఉంచి మూడు రోజులుగా విలపిస్తోంది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పగా విషయం బయటికొచ్చింది. నెల్లూరు ఫత్తేఖాన్‌పేట తామరవీధికి చెందిన వెంకటరాజేష్ (37)కు రెండేళ్ల క్రితం పెళ్లయింది. విభేదాలతో కొన్నాళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రాజేష్, అతని తల్లి విజయలక్ష్మి మానసికంగా కుంగిపోయారు. ఆలస్యంగా నిద్ర లేపాలని తల్లికి చెప్పి, ఈ నెల 5వ తేదీ రాత్రి రాజేష్ నిద్రపోయాడు. ఆరో తేదీ సాయంత్రం లేపినా అతడిలో కదలిక లేదు. కుమారుడి మృతిని తట్టుకోలేక ఆమె కుప్పకూలిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి రోదిస్తోంది. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సైదులు వచ్చి చూడగా రాజేష్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో మృతిచెందాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Nellore: వెంకటగిరిలో కరోనా కలకలం.. బాలికల గురుకుల పాఠశాలలో 18 మందికి కరోనా