నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో అన్నీ స్థానాలు క్లీన్‌స్వీప్ చేసి వైకాపా చరిత్ర సృష్టించిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డితో కలిసి ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు. మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డుల్లో మూడు ఏకగ్రీవం కాగా, 22 స్థానాల్లో ప్రత్యక్ష పోరుకు దిగి ఘన విజయం సాధించామని వారు వెల్లడించారు. తమను తీవ్రంగా విమర్శించిన ప్రతిపక్షాలకు ప్రజలు ఓటు ద్వారానే సమాధానమిచ్చారని చెప్పారు.
'జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే'
అధికారులను బెదిరించి, ఓటర్లను ప్రలోభ పరిచి గెలిచారని ప్రతిపక్షాలు విమర్శించటం అర్థరహితమని ఆనం ఖండించారు. గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో వైకాపాకు వచ్చిన ఓట్ల శాతం కంటే, ఇప్పుడు అధికంగా వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనే వైకాపా విజయానికి కారణమన్నారు. జమీందారి వ్యవస్థ, రాచరిక వ్యవస్థ అంటూ వెంకటగిరి గురించి ఒకప్పుడు చరిత్రలో చదువుకున్న తాము, ఇప్పుడు రాజకీయంగా చరిత్ర సృష్టించామన్నారు.
ఇదీ చదవండి: నాడు వార్డు వాలంటీర్..నేడు ఛైర్‌పర్సన్ !