వర్షాలకు వరి పంట నీటమునిగి ఆత్మహత్యకు యత్నించిన నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన రైతు వెంకటరత్నాన్ని.... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎడగారు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడడానికి ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు నిశ్చింతగా ఉండాలని ధైర్యం చెప్పారు.
నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడి... ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతును వెళ్లి పరామర్శించాలని మంత్రి ఆదేశానుసారం... సంగం మండల వైకాపా కన్వీనర్ కంటాబత్తిన రఘునాధరెడ్డి వెళ్లి పరామర్శించారు. అనంతరం వెంకటరత్నం కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. రైతుకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని వైద్యులకు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటలను పరిశీలించడానికి ఇప్పటికే కేంద్ర బృందం పర్యటించి నివేదిక పంపిందని... త్వరలోనే వాటికి నష్టపరిహారం అందుతుందని మంత్రి భరోసానిచ్చారు. నియోజకవర్గం, జిల్లాలో రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా ఎంజీఆర్ హెల్ప్ లైన్, కలెక్టరేట్ లో రైతులకోసమే టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశామని, తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. క్షణికావేశంలో అందరికీ అన్నం పెట్టే రైతన్నలు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి మేకపాటి కోరారు.
ఇదీ చదవండి: