తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహారశైలిని మంత్రి ఆదిమూలపు సురేష్ తప్పుబట్టారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఓట్లు అడగలేక... ఆయన హయాంలో చేసింది చెప్పుకోలేక... వైకాపా చేసిన అభివృధ్ధిపై అవాకులు, చవాకులు పేలడం హాస్యాస్పదమని నెల్లూరులో విమర్శించారు.
‘‘చంద్రబాబునాయుడు అమ్మఒడి, మనబడి, నాడు - నేడుపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా 15,700 పాఠశాలలను రూ.3,700 కోట్లతో తీర్చిదిద్దారు. చంద్రబాబు కట్టిన భవనాలకు మేం రంగులు వేశామని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. నిరూపించుకోకపోతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటారా? ఎన్నికల ప్రచారంలో అమ్మఒడి రూ.15 వేలు... నాన్న బుడ్డీకి సరిపోవడం లేదని చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్ల పేదరికం బిడ్డల చదువుకు అడ్డు రాకూడదనే అమ్మఒడి పథకాన్ని సీఎం తీసుకొచ్చారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: