పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని డీఈఈ మృతి చెందిన సంఘటన వేదాయపాలెం రైల్వేస్టేషన్‌లో గురువారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి పట్టణానికి చెందిన కామిశెట్టి విద్యాసాగర్(56) తెలుగుగంగ ప్రాజెక్టు పొదలకూరు సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సుధారాణి, నవ్య, సాయికుమార్ పిల్లలు. నెల్లూరు వేదాయపాలెం ఆర్‌ఆర్ టవర్స్‌లో ఉంటున్నారు. విద్యాసాగర్ కొంత కాలంగా కంటి సమస్యలతో బాధపడుతూ.. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఆ క్రమంలోనే గురువారం అక్కడికి వెళ్లేందుకు మెమో ఎక్స్‌ప్రెస్ రైలుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తల్లిదండ్రులిద్దరిని తన ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్‌కు చేర్చారు. ముందుగా తల్లిని కాలినడక వంతెన మీదుగా రెండో ప్లాట్‌ఫారంపైకి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే మెమో రైలు రావడంతో తల్లిని రైలెక్కించిన నవ్య.. తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు. కాలినడక వంతెనపై వెళితే.. రైలు వెళ్లిపోతుందన్న ఆతృతతో పట్టాలపై నడుస్తుండగా.. గూడూరు నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొంది. శరీరం మాంసం ముద్దగా మారి అక్కడికక్కడే మృతి చెందారు.
తండ్రి విగతజీవిగా..
తల్లి రైల్లోనే ఉండిపోయారు.. అది కాస్త బయలుదేరింది. పట్టాలపై తండ్రి మృతదేహం.. ఆ పక్కనే మోగుతూనే ఉన్న సెల్‌ఫోన్.. ఎవరూ తీయడం లేదు. అదే సమయంలో ప్లాట్‌ఫారంపై ఫోన్‌తో హడావుడిగా తిరుగుతున్న యువతితో రైల్వే సిబ్బంది మాట్లాడారు. తన తండ్రికి ఫోన్ చేస్తున్నానని, ఎందుకో తీయడం లేదని కన్నీరుమున్నీరవుతూ తెలిపారామె. అనుమానం వచ్చిన రైల్వే సిబ్బంది విద్యాసాగర్ మృతదేహాన్ని చూపించగా.. తన తండ్రేనంటూ బోరుమన్నారు నవ్య. ఈ హృదయ విదారక సంఘటన అక్కడి వారందరినీ కలచివేసింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: MURDER: వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణం!