Lokesh participated in mahashakti program: దాడులు చేయడం వైకాపా సంస్కృతిగా మారిందని, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా, 'మహాశక్తితో లోకేశ్' పేరిట మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళ తమ సమస్యలు చెప్పుకుంటూ.. కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరైనా మహిళల జోలికి వెళ్లాటంటే భయపడే పరిస్థితి కల్పిస్తామని లోకేశ్ ఆమెకు భరోసా ఇచ్చారు.
యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు నగరంలో మహాశక్తితో లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, డిగ్రీలు చేసిన మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తుందని బాధితులు ఆవేదన వెలిబుచ్చారు. అక్రమ కేసులతో మహిళలను వేధించారని సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమ్మ ఒడి లేదు... మద్యపాన నిషేధం లేదు... పింఛన్ల హామీలు ఏమయ్యాయని సభకు వచ్చిన మహిళలు ప్రశ్నించారు.
నాకు చెల్లెల్లు లేరు.. కానీ మహిళను గౌరవించాలని అమ్మ భువనేశ్వరీ చిన్నప్పటి నుంచి నేర్పించిందని నారా లోకేశ్ వెల్లడించారు. ప్రతీ ఇంట్లో మహిళలకు గౌరవం ఇచ్చేలా ప్రోత్సహించాలని లోకేశ్ వెల్లడించారు. యువతలో చైతన్యం రావాలని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిందాలను ప్రశ్నించాలన్న లోకేశ్.. అప్పుడే పరిపాలనలో సముల మార్పు వస్తుందని వెల్లడించారు. మహిళను గౌరవించాలి అనే సమాజం కావాలని.. అయితే, ఈ ప్రభుత్వంలో మహిళకు గౌరవం లభించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత మహిళను వేధించిన వారిని ఎవరినీ వదలనని లోకేశ్ హెచ్చరించారు. పిల్లలకు చినప్పటి నుంచే విలువలతో కూడిన విద్య నేర్పడం అవసరమని లోకేశ్ సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుంచి పీజీ వరకు విద్యను బలోపేతం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఒక తల్లి పడే బాధ, అవేదన తాను చూశానన్న లోకేశ్, శాసనసభ, ప్రజల సాక్షిగా నా తల్లిని అవమానపరిచారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎక్కడికి పోతుందో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను, మా పార్టీ ఇలాంటి వాటిని సహించబోమని లోకేశ్ పేర్కొన్నారు. అనూష మీద దాడి చేసిన వ్యక్తిపై పెట్టిన దిశ చట్టానికే దిక్కులేదని లోకేశ్ విమర్శించారు.
అనుభవం, అవగాహన లేని వారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. జగన్ తన స్వార్ధం కోసం సొంత చెల్లికి, తల్లికి, చిన్నానకు అన్యాయం చేసిన వ్యక్తి అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.