తాజాగా జరిగిన పుర పోరులోనూ అంతిమంగా ఓటరే ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరులోని వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు పురపాలక సంఘాల్లో గత ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం పోలింగ్ శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనం.
సూళ్లూరుపేట.. ఆదర్శం ఏదంట?
సూళ్లూరుపేట పురపాలకలో మూడ్రోజుల కిందట జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. మొత్తం 25లో కేవలం 11 వార్డులకు మాత్రమే పోరు జరగడం.. అందులోనూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో 72.27 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోరులో 15,354 మంది ఓటర్లకు కేవలం 10,173 మంది మాత్రమే ఓటేయడంతో.. 66.26 శాతమే తేలింది. గతంతో పోలిస్తే 8 శాతం మేర ఓటింగ్ తగ్గింది. విద్యావంతులున్న షార్ ఉద్యోగుల కాలనీ పులికాట్‌నగర్‌లో రెండో వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా- అందులో ఓ చోట కేవలం 43.71 శాతం మంది మాత్రమే ఓటు వేశారు.
సూళ్లూరుపేట పట్టణం నడిబొడ్డులోని 15, 16 వార్గుల్లోనూ ఆశించిన మేర పోలింగ్ నమోదు కాలేదు. ఇదే తరహాలోనే 13వ వార్డులోని ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 51.57 శాతం, 12వ వార్డులోని ఒకటో కేంద్రంలో 56.33 శాతం, 20వ వార్డులోని రెండో కేంద్రంలో 58.17 పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో రెండు స్థానాలు మినహా.. మిగతా 23 వార్డుల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. తెదేపా, వైకాపా, కాంగ్రెస్ నువ్వా- నేనా అన్నట్లు తలపడ్డాయి. అందుకు భిన్నంగా ఈ సారి 14 వార్డులు ఏకగ్రీవం కావడం.. 11 స్థానాలకే ఎన్నికలు జరగడంతో ఓటర్లు సైతం ఆసక్తి చూపలేదన్న వాదన ఉంది.
గిరి.. నిర్లక్ష్యం దరి
పుర పోరులో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో వెంకటగిరి ఓటర్లు వెనుకబడ్డారు. గతంతో పోలిస్తే చైతన్యమూ సన్నగిల్లింది. యువ ఓటర్లతో ఓటింగ్ సరళి పెరగొచ్చన్న అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. తాజా ఎన్నికల్లో ఆది నుంచీ పోలింగ్ సరళి పేలవంగానే సాగింది. 8 గంటల వరకు కేవలం అయిదు శాతమే నమోదైంది. వెంకటగిరి పురపాలకగా ఆవిర్భవించాక, మొత్తం మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఈ సారి మాత్రమే అత్యల్పంగా ఓట్లు పోలయ్యాయి. తొలిసారిగా 2005లో సమర భేరి మోగగా- అప్పట్లో 74.50 శాతం ఓట్లు పోలై.. జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2014 ఎన్నికల్లో 79.10 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి జిల్లాలో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. ముచ్చగా మూడోసారి జరిగిన ఎన్నికల్లో.. పుర ఓటర్లు ఇంట్లో నుంచే బయటకొచ్చేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 25 స్థానాలకు గాను మూడు ఏకగ్రీవం కాగా, మరో 22 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 38,601 మంది ఓటర్లకు గాను 27,287 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 70.69 శాతం పోలింగ్ నమోదైంది. గత పుర పోరుతో పోలిస్తే దాదాపు తొమ్మిది శాతం ఓట్లు తగ్గడం గమనార్హం.
నాయుడుపేట.. చైతన్య బావుటా
వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేటతో పోలిస్తే.. నాయుడుపేటలో మాత్రమే ఓటింగ్ శాతం పెరిగింది. ఇక్కడ మొత్తం 25 వార్డులుండగా.. 23 స్థానాలు ఏకగ్రీవమై పోయాయి. కేవలం 6, 24వ వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ రెండు వార్డుల్లో 3026 ఓట్లుండగా- 2334 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 77.13 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 60 శాతం మాత్రమే పోలింగ్ జరగడం గమనార్హం. గతంతో పోలిస్తే ఏకంగా 17 శాతం పోలింగ్‌పెరిగింది.
ఆత్మకూరు.. ఏదా జోరు
ఆత్మకూరులోనూ గతంతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది. ఆత్మకూరు పురపాలకగా ఏర్పడిన తర్వాత 2014లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 23 వార్డులకూ అభ్యర్థులు తలపడ్డారు. 24,429 ఓట్లకు గాను 19,475 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 78.71 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోరులో 77.25 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. గతంతో పోలిస్తే 1.46 శాతం ఓటింగ్ తగ్గింది.
23 వార్డుల్లో 17కు మాత్రమే ఎన్నికలు జరగ్గా- 7 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 19,238 మంది ఓటర్లకు 14,862 మాత్రమే ఓటేశారు. గత పోరులో తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా హోరాహోరీ తలపడ్డాయి. అప్పటితో పోలిస్తే ఆత్మకూరు పట్టణం బాగానే అభివృద్ధి సాధించింది. విద్యావంతులూ పెరిగారు. ఈ లెక్కన ఓటింగ్ 80 శాతానికి పైనే నమోదవుతుందని అధికారులు భావించారు. అందుకు భిన్నంగా సాగడంపై అధికారులు సైతం విశ్లేషణల్లో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: నాయుడుపేటలో తెదేపా దళిత మహిళా నేతల నిరసన