ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Hypotension) బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. చెన్నై-పుదుచ్చేరి తీరాలకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం సాయంత్రానికి చెన్నైకి సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు . దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వానలు(heavy rain) కురవనున్నాయి. రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. సముద్రంలో 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్ఠంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడొచ్చని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
చెన్నై సహా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై సహా ఉత్తర జిల్లాలకు అతి భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాయుగుండం ఉత్తర దిశలో ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెన్నైలో గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర చెన్నై, తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం ఉత్తర తమిళనాడు జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టగా.. డెల్టా జిల్లాల్లో భారీగా పడ్డాయి. నాగపట్టణం, తిరుప్పూండి ప్రాంతాల్లో అత్యధికంగా 31 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కారైక్కాల్‌లో 29సెం.మీ., వేదారణ్యం 25 సెం.మీ. చొప్పున వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. తిరువారూర్, తంజావూర్, మన్నార్‌గుడి, మైలాడుదురై, పట్టుకోట్టై సహా ఇతర డెల్టా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.
ఇదీ చదవండి