అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తా ప్రపంచదేశాలకు మరోసారి తెలిసొచ్చింది. శ్రీహరికోట వేదికగా నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ- సీ 48 ప్రయోగం విజయవంతమైంది. 3 గంటల 35 నిమిషాలకు నిప్పులు కక్కుకుంటూ నింగికెగిరిన పీఎస్‌ఎల్‌వీ- సీ 48 వాహక నౌక రీశాట్-2బీఆర్1 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన మరో తొమ్మిది ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. రీశాట్- 2బీఆర్ 1 ఉపగ్రహాన్ని 576 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనితోపాటు అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్‌లకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహాన్ని ఇస్రో నిర్ణీత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశపెట్టింది.
ఐదేళ్ల పాటు సేవలు
రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రీశాట్-2 BR 1 బరువు 628 కేజీలు కాగా వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. మొత్తం ఐదేళ్ల పాటు రీశాట్-2 బీఆర్1 సేవలందిస్తుంది. ఈ ఏడాది మే 22న విజయవంతంగా ప్రయోగించిన రీశాట్-2బీకి కొనసాగింపుగా ఈ ప్రయోగం చేపట్టారు.
576 కి.మీ. కక్ష్యలోకి
పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందని ఇస్రో ఛైర్మన్ శివన్ అన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-48 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 50వ ప్రయోగమని... షార్ నుంచి చేపట్టిన 75వ ప్రయోగమని వెల్లడించారు. 576 కిలోమీటర్ల కక్ష్యలోకి రీశాట్ 2బీఆర్1 ఉపగ్రహం ప్రవేశపెట్టామని ప్రకటించారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు.