నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఉదయగిరికి చెందిన సప్లయర్ కృష్ణా రెడ్డి.. మర్రిపాడు మండలంలోని సింగన్నపల్లి, నాగినేని గుంట, చాబోలు గ్రామాల్లో చౌకదుకాణాలకు బియ్యాన్ని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయగిరి పౌరసరఫరాల శాఖ గోదాంలో 317 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలించేందుకు లారీలో లోడ్ చేయించారు. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన చాటుగుంట వెంకటేశ్వరరావుతో ఒప్పందం చేసుకుని.. ఈ బియ్యాన్ని మరో చోటుకు తరలించేందుకు ప్రణాళికలు వేశారు. బియ్యం లోడుతో వస్తున్న లారీ నందిపాడు పరిసర ప్రాంతంలోకి వచ్చిన తరువాత.. బియ్యాన్ని మరో లారీలోకి మార్చుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను చూసిన కూలీలు పారిపోగా.. అక్కడే ఉన్న కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్‌రావు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'సమస్యలపై ప్రశ్నిస్తే డిశ్చార్జి చేస్తామంటున్నారు'