భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. సెక్షన్ 498ఏ(మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించటం)ప్రకారం..భర్త రక్తసంబంధీకులు, అతని బంధువులను మాత్రమే విచారించడానికి వీలుందని స్పష్టం చేసింది.
ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ 'వేరే మహిళ'పై పోలీసులు 498ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తన భర్తతో అక్రమ సాన్నిహితం కలిగి ఉన్నారని ఒక మహిళ ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా దిశ మహిళ ఠాణా పోలీసులు 498ఏ , మరో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ భర్తను మొదటి నిందితునిగా , సాన్నిహితంగా ఉంటున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు. దిశ పోలీసులు 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్... ఫిర్యాదుదారి భర్తకు బంధువు కాదన్నారు.అందువల్ల ఆమెపై 498ఏ కేసు చెల్లదన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణలోకి తీసుకుని... పిటిషనర్‌పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేశారు. మరో నిందితుడిపై దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి