Heavy rains lash Andhra Pradesh: అల్పపీడన ధోరణి ప్రభావం కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు బస్టాండు, మినీ బైపాస్ రోడ్డు, బీవీనగర్, పడారుపల్లి, ఇందిరమ్మ కాలనీ, బుజబుజ నెల్లూరు, వేదాయపాలెం, ట్రంకు రోడ్డు, పొదలకూరు రోడ్డు, శాంతినగర్, కొత్తూరు, మూలపేట, రంగనాయకులపేట స్టోన్ హౌస్ పేట, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఆత్మకూరు బస్టాండు, విజయ్ మహల్ గేటు, రామ్మూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షంతో ప్రజలు, రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
వర్షాలపై కలెక్టర్ సమీక్ష: జిల్లాకు భారీ వర్ష సూచన ఉండటంతో లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలపై కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా తీర ప్రాంత మండలాల్లో రెవెన్యూ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి మండలంలో కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో ఉన్న కేంద్రంతో అనుసంధానం చేశారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఆత్మకూరు: ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చల్లటి గాలులతో వర్షాలు పడుతుండటంతో ప్రజలు బైటకు రాలేని పరిస్దితి నెలకొంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆత్మకూరు, ఏఎస్ పేట, సంగం, మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల మండలాల్లో మోస్తారు వర్షం పడుతుంది. సోమశిల ఇప్పటికే పూర్తిస్దాయి నీటితో నిండి వుండగా.. నియోజకవర్గంలోని చెరువులన్నీ నీటితో నిండుకుండలా మారాయి. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి