ఆలనా పాలనా చూడాల్సిన తాతే.. అల్లారుముద్దుగా ఆడించాల్సిన తాతే... మనవరాలి పాలిట కీచకుడయ్యాడు. అఘాయిత్యానికి ఒడిగట్టి.. అనంతరం యముడిగానూ మారాడు. కామంతో కాటేసిన ఆ ముసలాయనే.. అభం శుభం తెలియని ఆ అమ్మాయి ప్రాణం తీశాడు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఆ తాత ఓ కట్టుకథనే అల్లాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ నిజం...
ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు... దర్యాప్తు మొదలుపెట్టారు. ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు చెప్పారు కానీ... అమ్మాయి మెడ చుట్టూ ఉరివేసుకున్న గుర్తు లేకపోవడాన్ని గమనించారు. తాత, అమ్మమ్మలు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు. అప్పుడే అసలు విషయం వెలుగుచూసింది.
కోడి మెడ తిప్పినట్టు తిప్పీ...
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాత వెంకటేశ్వర్లు.. మనవరాలు చేయి పట్టుకుని అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమెను గట్టిగా కొట్టాడు. కోడి మెడ తిప్పినట్టు తిప్పేసి బలంగా బాదేసరికి స్పృహతప్పి పడిపోయింది. తర్వాత తన పైశాచికత్వాన్ని చూపించాడు. అనంతరం ఆమె చున్నీని దూలానికి కట్టి ఉరివేసుకున్నట్టు అందర్నీ నమ్మించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. నేరం అంగీకరించిన వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.