Drunken Two-Wheeler Driver : తెలిసీ తెలియక చేసిన పొరపాట్లు కొన్నిసార్లు ఊహించని మలుపు తీసుకుంటుంటాయి అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా మందుబాబులకు పట్టింపు లేకుండా పోయింది. జరిమానా విధించినా, కేసులు పెట్టి కోర్టులకు పంపినా మార్పు రావడం లేదనేది వాస్తవం. నిత్యం వేలాది డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదై ఎంతో మంది జైళ్ల పాలవుతున్నారు.
మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలు అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరిగిన ఓ ఘటన వార్తల్లోకెక్కింది. మద్యం సేవించి బైక్ నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి స్టేషన్లో హంగామా చేశాడు. దాదాపు అరగంట పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. వివరాలివీ..
తాగి నడిపితే జైలుకే..! తనిఖీలతో హడలెత్తిస్తున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన కీసరి గంగాధర్(30) తన సమీప బంధువు గంగాధర్ బుధవారం ఉదయం మద్యం సేవించారు. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు బైక్ సీజ్ చేశారు. చలానా వేసి తమను వదిలేయాలని గంగాధర్ కోరగా పోలీసులు వాహనం జప్తు చేసి స్టేషన్కు తరలించారు.
కాగా, బైక్ తన బంధువుదని, దాన్ని ఇచ్చేయాలని కీసర గంగాధర్ బైక్ వద్దకు వెళ్లాడు. తన వెనకే కానిస్టేబుల్ వస్తుండడంతో పట్టుకునేందుకు వస్తున్నాడనే భయంతో గంగాధర్ అక్కడున్న చెట్టెక్కి కూర్చున్నాడు. కిందకు దిగాలని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా అరగంట పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. చిటారు కొమ్మపై కూర్చొని వెంట తెచ్చుకున్న మద్యం సేవించి పోలీసులపై కేకలు వేశాడు. అతడు చెట్టు పైనుంచి పడిపోతే ప్రాణాలు దక్కవనే ఉద్దేశంతో పోలీసులు చెట్టు కింద జాలి ఏర్పాటు చేసి రక్షించే ప్రయత్నం చేశారు. బండిని ఇచ్చేస్తామని, చెట్టు దిగిరావాలని చెప్పినా వినకుండా పైనుంచి కిందకు దూకేశాడు.
పోలీసులు రక్షణగా పట్టుకున్న జాలి పైనుంచి నేలపై పడిపోవడంతో గంగాధర్ నడుము, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్పృహతప్పిన అతడిని పోలీసులు తమ వాహనంలో కామారెడ్డికి, అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం పోలీసులు గంగాధర్ వాహనాన్ని స్టేషన్ బయట పెట్టడం కొసమెరుపు. అడిగిన వెంటనే వాహనం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గంగాధర్ బంధువులు ఆరోపిస్తున్నారు.
మందుబాబులకు రక్తదానం తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ సర్కార్
ఆధారాలు లేకుండా మద్యం మత్తును నిర్ధారించడానికి వీల్లేదు: హైకోర్టు