నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతోపాటు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి చేసిన కృషితో సోమశిల జీకేఎన్ కాలువ అభివృద్ధికి త్వరలో అడుగులు పడనున్నాయి. కాలువ ప్రధాన ద్వారం వద్ద దాదాపు 700 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నా రాళ్లపాడు ప్రాజెక్టు వరకు వచ్చేసరికి 50 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. మధ్యలో ఉన్న రాజోలు చెరువు కాలువ కంటే దిగువస్థాయిలో ఉండటం కూడా ఓ ప్రధాన అడ్డంకిగా ఉంది. అలాగే రామాయపట్నం ఓడరేవుకు సమీపంలో పెద్ద జలాశయాలు లేకపోవడంతో రాళ్లపాడు నుంచే నీటిని అందించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతిపాదనాలు సిద్ధం..
ఓడరేవుకు 0.5 టీఎంసీలు కేటాయించే ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న కాలువ సామర్థ్యాన్ని 150 నుంచి సుమారు 350 క్యూసెక్కులకు పెంచేందుకు, రాజోలు చెరువుకు వెళ్లకుండా నూతన కాలువ ఏర్పాటుకు, మొత్తం 0-100 కి.మీ. మేర వెడల్పునకు ఎమ్మెల్యే అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.
ప్రభుత్వం అనుమతి...
దీనికి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు మద్దతు తెలపడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అనుమతులు ఇచ్చారని, త్వరలో టెండర్లు కూడా పిలుస్తారని ఎమ్మెల్యే తెలిపారు. రాళ్లపాడుకు వెలిగొండ నుంచి ఈస్ట్రన్ కెనాల్ ద్వారా నీటిని తీసుకొచ్చే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కాలువ సామర్థ్యం పెరిగితే నీటి వృథాను అరికట్టడంతోపాటు వీలైనంత త్వరగా రాళ్లపాడుకు నీటిని తరలించుకునే అవకాశం ఉంటుందని జలాశయా అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి