నెల్లూరు జిల్లాలోని కొడవలూరు ప్రాంతంలో జూదం జరుగుతోందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానిక పోలీసులకు ఎస్పీ సూచించారు. అయినా ఎలాంటి మార్పు కనిపించలేదు. జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో పేకాట భారీస్థాయిలో జరుగుతోందని, పోలీసులు పట్టించుకోవడం లేదని మరోసారి ఎస్పీ దృష్టికి రావడంతో సీరియస్ అయ్యారు. పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ ఆధ్వర్యంలో కేంద్రంపై దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా పక్కా ప్రణాళికతో తనిఖీలు నిర్వహించగా, విషయం తెరపైకి వచ్చింది. 23 మంది జూదరులతో పాటు నిర్వహకుడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అతనిని విచారించగా అసలు విషయం బహిర్గతమైంది. ఎవరెవరికి ఎంత ముట్టజెబుతున్నారు.. ప్రతినెల ఎంత? ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకున్నారు. స్థానిక ఎస్సైతో పాటు స్పెషల్‌బ్రాంచి ఎస్సై ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కోవూరు సీఐ వాహన డ్రైవరుతో మరో కానిస్టేబుల్‌కు నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు చెప్పడంతో నలుగురిపై చర్యలుతీసుకున్నారు.
నిఘా వ్యవస్థ ఏమైంది?
చీకటి కార్యకలాపాలు.. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా.. పోలీసులకు సమాచారం రావాలి. దీని కోసం పోలీసు శాఖ ప్రత్యేక విభాగాలు కేటాయించింది. ప్రతి పోలీసు స్టేషన్, సర్కిల్, డివిజన్ పరిధిలో పార్టీలు ఉంటాయి. ఐడీ పార్టీ, స్పెషల్ బ్రాంచి విభాగాలు ఉంటాయి. ఆయా పోలీసులు సామాన్యులతో కలిసి సమాజంలో ఏం జరుగుతుందో ఆరా తీయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారం నేరుగా జిల్లా ఎస్పీకి చేర్పించాల్సి ఉంది. హోటళ్లు, ప్రధాన కూడళ్లు, అధికార, అనధికార, ప్రభుత్వ కార్యక్రమాల్లో మఫ్టీలో తిరుగుతూ సమాచారం సేకరించాలి. చీకటి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? తదితర వివరాలన్నీ ఎస్పీకి అందజేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది పరిశీలిస్తే ఆయా విభాగాలు కూడా మామూళ్ల మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కొడవలూరు పేకాట విషయంలో ఒక ఎస్‌బీ ఎస్సై ఉండటం నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీకి ఎస్‌బీ విభాగం ఒక ఆయుధం లాంటిది. జిల్లా వ్యాప్తంగా ఏం జరుగుతోంది? ఎవరేమి మాట్లాడుకుంటున్నారు? ఎవరిపై ఆరోపణలు వస్తున్నాయి? ప్రతిదీ జిల్లా ఎస్పీకి నివేదిక అందజేయాలి. అలాంటి వ్యవస్థకు చెందిన ఒక ఎస్సై సస్పెన్షన్‌కు గురవడం గమనార్హం.
రైతుల గదులే జూద స్థావరాలు
పొలాల్లో మోటార్లు, పరికరాల కోసం నిల్వ ఉంచుకునే గదులే ప్రస్తుతం జూద కేంద్రాలుగా మారాయి. కొడవలూరులో నెల్లూరు పోలీసులు దాడులు చేసిన ప్రాంతం ఓ రైతుకు చెందినది కావడం విశేషం. గతంలో కోవూరు పేకాట క్లబ్ ఉండేది. దానిపై పోలీసులు దాడులు చేసి సీజ్ చేయడంతో నిర్వాహకులు తమ మకాం మార్చారు. ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే మూడు జూద కేంద్రాలు ఉన్నట్లు తెలిసింది. తాజాగా కొడవలూరులో పోలీసులు దాడులు చేసిన ప్రాంతంతో పాటు కోవూరులోని కొత్తూరు హరిజనవాడలోని ఓ గది, యల్లాయపాలెం పరిధిలోని మలిదేవి వాగు గట్టున ఉండే ఓ రైతు గదిలో జూదం జోరుగా సాగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో కార్లు వస్తూపోతున్నాయని సమాచారం. జిల్లావాసులే కాదు.. చెన్నై నుంచి కూడా జూదరులు వస్తున్నారు. ఒక్కో టేబుల్ రూ.లక్షల్లోనే ఉంటోంది. ఈ జూద కేంద్రాలన్నీ గతంలో పోలీసులు దాడులు చేసి సీజ్ చేసినవే. రోజులు మారేకొద్ది నిర్వాహకులు పోలీసులతో పరిచయాలు పెంచుకొని నెల మామూళ్లతో వాటిని మళ్లీ తెరుస్తున్నారు.
సస్పెండ్ అయిన వారు వీరే..
జిల్లాలో నలుగురు పోలీసులను సస్పెన్షన్ చేస్తూ సౌత్ కోస్టల్ డీఐజీ త్రివిక్రమ వర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో కొడవలూరు ఎస్సై షేక్ జిలానీ, స్పెషల్ బ్రాంచి ఎస్సై పి.వెంకట సాయి, కోవూరు పీఎస్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాసులు, ఏఆర్ పీసీ యు.శ్రీకాంత్ ఉన్నారు. వీరితో పాటు కోవూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.రామారావును వీఆర్‌కు పంపిస్తూ ఆదేశించారు.
ఇదీచదవండి
'50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..?'