వందలాది మంది మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపే ఫిషింగ్ హార్బర్ పనులకు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద వడివడిగా అడుగులు పడుతున్నాయి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు ఏర్పాటుతో మత్య్సకారుల చేపలవేటకు వేదిక లేకుండా పోయింది. అప్పట్లో సరైన సౌకర్యాలు లేక జీవనోపాధి కోసం జిల్లాలోని మత్య్సకారులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల వైపు వెళ్లాల్సి వచ్చేది. ఆ బాధలకు చరమగీతం పాడుతూ గత ప్రభుత్వం జువ్వలదిన్నె సమీపంలో చిప్పలేరు సముద్రంలో కలిసే ప్రాంతం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించింది. భూ కేటాయింపు కూడా చేసింది. సాంకేతిక, పర్యావరణ శాఖలు కూడా ఆమోదముద్ర వేశాయి. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.288కోట్లు అవసరమని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు ఆ ఆమోదం తెలిపే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో అక్కడితో నిలిచిపోయాయి.
సమానంగా వాటా..
జువ్వలదిన్నె వద్ద చేపలరేవు ఆవశ్యకతను గుర్తించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మత్య్సకారుల కష్టాలు తీర్చేందుకు అడుగులు వేశారు. ప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.38కోట్లు నిధులు కేటాయించారు. 73.53ఎకరాలు భూమి కేటాయింపునకు ఆమోదం కూడా తెలిపారు. రూ.288కోట్ల వ్యయంతో చేపట్టే ఈ చేపలరేవుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం చెరిసగం వాటాలు వేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిచేసి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు సన్నాహాలు జరిగాయి.
రెండు జిల్లాలకు వరం..
జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేయబోతున్న చేపలరేవు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వేట సాగించే మత్య్సకారులకు వరం కానుంది. 1,200 బోట్లు నిలబడేందుకు అవసరమైన వసతులు సమకూర్చనున్నారు. అందుకోసం బెర్తులు ఏర్పాటు చేసే ప్రాంతంలో చిప్పలేరు కలిసే సముద్రం ముఖద్వారం వద్ద డ్రెడ్జింగ్ యంత్రం రంగంలోకి దిగింది. బెర్తులు ఏర్పాటు చేసే ప్రాంతంలో ఉన్న మట్టిని దూరంగా వేసే పనులు త్వరలో ప్రారంభించనున్నారు. ఓ క్రమ పద్ధతిలో పనులు వేగవంతం చేసి 2022 ఆఖరికల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండగా మత్య్సకారుల కలలు త్వరలోనే నెరవేరనుంది.
మరో వారంలో పనులు ప్రారంభిస్తాం
జువ్వలదిన్నె వద్ద మత్స్యరేవు నిర్మాణానికి వేగంగానే అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే డ్రెడ్జింగ్ యంత్ర వాహనం అక్కడకు చేరుకుంది. మరో వారం రోజుల్లోగా పనులను ప్రారంభిస్తాం. మత్స్యకార్లందరికీ మేలు జరిగేలా ఈ ఓడ రేవు నిర్మాణం చేపడుతున్నాం. - రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కావలి
ఉపాధికి పుష్కల అవకాశాలు..
ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే ఉపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లిన మత్య్సకారులు తిరిగి సొంత ప్రాంతాలకే వచ్చే వీలుంది. స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. కోల్డ్‌స్టోరేజీలు వంటి అనుబంధ వ్యాపారాల విస్తరణ పెరిగి గ్రామీణులకు ఉపాధి దొరుకుతుంది. తీర ప్రాంతం అభివృద్ధికి బాటలు పడనున్నాయి. దాంతో మత్య్సకారుల జీవితాలు కళకళలాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదీ చూడండి: