నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీసు సెంటర్ శ్రీ సాయి నివాస్ అపార్టుమెంట్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పేలటంతో మూడో అంతస్థులో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఇంట్లో విద్యుదాఘాతం జరిగింది. విజయలక్ష్మి ఇంటి నిండా ర్యాక్‌లలో చీరలు అమర్చి ఉండటంతో మంటలు పెరిగిపోయాయి. వీటితో పాటు వంట గదిలో ఉన్న సిలిండర్, బాత్‌రూంలో ఉన్న మరో సిలిండర్ పేలటంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. మంటలు ఎక్కువటంతో నాలుగో అంతస్థులో గల 202 ప్లాట్‌లోకి అంటుకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో, అపార్టుమెంటులో ఏర్పాటు చేసిన నీటి పంపులతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. రాత్రి వరకు సిబ్బంది కష్టపడ్డారు. ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్ముకుని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి ఇంట్లో ఉన్న 40 సవర్ల బంగారు ఆభరణాలు, 8కేజీల వెండి వస్తువులు, రూ.40వేల నగదుతో పాటు ఇంట్లోని విలువైన చీరలు, సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. రూ.కోటికిపైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితురాలు విజయలక్ష్మి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి