నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఊటుకూరు గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో వారందరికీ కండువా కప్పి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరే వారికి సముచిత స్థానమిచ్చి, ఎలాంటి సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని.. ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తున్న వైకాపాకు ప్రజలే రానున్నకాలంలో బుద్ధి చెబుతారన్నారు.
రాష్ట్రంలో అన్నదాతలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా నట్టేట ముంచారని దుయ్యబట్టారు. వరదలొచ్చి రైతులు పూర్తిగా నష్టపోయినా.. పరిహారం ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మద్యం ఆదాయంపైనే ఆధారపడటం దారుణమన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తున్నారని, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల ప్రజలపై భారం మోపుతున్నారని నేతలు ఆరోపించారు.
ఇదీ చదవండి: