ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నెల నుంచే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించడంతో నెల్లూరు జిల్లాలో రైతులు ఆనందించారు. గతేడాది కంటే కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచి... 179 చేయడంతో కొనుగోళ్లు పెరిగాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, చెల్లింపుల్లో మాత్రం ప్రారంభం నుంచి జాప్యం జరుగుతూనే ఉంది. స్థానిక ఎన్నికల హడావుడి, లాక్‌డౌన్.. ఆ తరువాత ఖరీఫ్, రబీ సీజన్ల మార్పిడితో పలుమార్లు అంతరాయాలేర్పడ్డాయి.
ఈ నెల 20వరకు కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు...
- ధాన్యం విక్రయించి నగదు పొందిన రైతులు 10,761
- విక్రయించిన ధాన్యం (టన్నుల్లో) 2,28,416
- పొందిన ధనం (రూ. కోట్లలో) 418.27
- ధాన్యం విక్రయించి నగదు పొందని రైతులు 2,324
- విక్రయించిన ధాన్యం (టన్నుల్లో) 59,343
- అందాల్సిన మొత్తం (రూ. కోట్లలో) 108.43
నెలరోజులు దాటినా..
గతనెలలో ధాన్యం విక్రయించిన రైతులకు ఇప్పటికీ చెల్లింపులు జరగలేదు. వారు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమాధానం చెప్పేవారు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను కలిసి సమస్య విన్నవించినా వారినుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
పెరుగుతున్న అప్పుల భారం...
ధాన్యం విక్రయించినా నగదు చేతికి రానందున అప్పుల భారం పెరిగిపోతోందని వాపోతున్నారు. పెట్టుబడికి తీసుకున్న రుణం, ఎరువుల దుకాణాల యజమానులకు చెల్లించాల్సిన బకాయిలు, వాటికి వడ్డీలు తలకు మించిన భారంగా మారుతున్నాయి. కౌలుదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
బకాయిలు చెల్లించాల్సింది వాస్తవమే...
రైతులకు బకాయిలు చెల్లించాల్సింది వాస్తవమే. ప్రభుత్వం రోజుకు రూ.5 కోట్ల వంతున జమచేస్తోంది. అందుకనుగుణంగా చెల్లింపులు చేస్తున్నాం. త్వరలో బకాయిలు పూర్తిగా ఇస్తాం. - రోజ్‌మాండ్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు
ఇదీ చదవండి: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: గుంటూరు జిల్లాలో తెదేపా నేతపై దాడి