వరద జలాలు సద్వినియోగమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలవుతున్నా... వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల వరద జలాలు తరలించే అవకాశం ఉన్నా...కేవలం 24 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారన్నారు. గతేడాది కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడకపోయినా 48.5 టీఎంసీల నీటిని సోమశిలకు తీసుకువచ్చామని తెలిపారు. సోమశిల నుంచి కండలేరుకు నీళ్లు విడుదల చేసినప్పుడే జిల్లాలో సాగు, తాగునీటికి ఏలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తద్వారా చెన్నై, చిత్తూరు జిల్లాకు నీటి విడుదలకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానం ప్రజలపై భారం మోపేలా ఉందని విమర్శించారు. గతంలో 11వందల రూపాయలకు వచ్చే ఇసుక ఇప్పుడు 2300 రూపాయలకు పైగా పెరిగిందన్నారు. అధికార పార్టీ నేతలు తమపై లేనిపోని కేసులు పెడుతూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై పెట్టిన కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లతో కాకుండా పరిపాలనాదక్షతతో విధులు నిర్వహించాలని కోరారు.
ఇదీచదవండి