నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకే ఒక వర్గమని.. అది సీఎం జగన్ వర్గం మాత్రమేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అందరూ జగన్ బొమ్మతోనే గెలిచామన్న అనిల్.. భవిష్యత్‌లోనూ ఎవరైనా సరే.. జగన్ బొమ్మతోనే గెలవాలన్నారు. నెల్లూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో తన అనుకూల వర్గంతో "ఆత్మీయ సభ" నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాను ఎవరికీ పోటీగా సభ పెట్టలేదని చెప్పారు. తనకు తానే పోటీ అన్నరు. ఆత్మీయ సభ పెడతానని ముందే చెప్పానన్న అనిల్.. ఎవరికీ బల నిరూపణ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.
చిన్న వయసులోనే మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం జగన్ కల్పించారని అనిల్ అన్నారు. రెండున్నరేళ్ల పాటు మంత్రిగా విధులు నిర్వహించానన్న అనిల్.. మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటానని జగన్ చెప్పారని అన్నారు. "వెయ్యి రోజులు మంత్రులుగా చేశారు. నాకోసం మరో 730 రోజులు కష్టపడండి.. మళ్లీ కేబినెట్‌కు వస్తారు" అని జగన్ మాటిచ్చారని అనిల్ చెప్పారు. కాబట్టి.. కచ్చితంగా ఆయన కోసం పనిచేస్తామని అన్నారు. మంత్రివర్గం నుంచి తీసేశారని ఎప్పుడూ బాధపడలేదన్న అనిల్.. ప్రజాసేవ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్, ప్రజలు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు.
నెల్లూరు జిల్లాలో తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఒకసారి మంత్రినయ్యాని చెప్పారు. తన ఈ జిల్లాలో చెప్పుకొనేందుకు తనకంటూ ఒక పేజీని జగన్ ఇచ్చారన్న అనిల్.. తనలాంటి వ్యక్తికి ఇంతకన్నా ఏం కావాలన్నారు. జగన్ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిదని చెప్పారు. 2024లో జగన్‌ను మరోసారి గెలిపించేందుకు కృషి చేస్తామని, మంత్రులుగా మళ్లీ వస్తామని అన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నెల్లూరు ప్రజలతోనే ఉంటానన్న అనిల్.. ఇప్పటివరకు నాతో ప్రయాణం చేసిన వారినీ.. ఇకపై చేసేవారినీ.. అందరినీ కలుపుకొని వెళ్తానని అన్నారు.