నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. దీనికోసం కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించారు. హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్, లాడ్జీల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా ఇందులో ఉంటాయి.
వాటి వాసనకే జనం ఇబ్బంది పడతారు. అలాంటిది అందులో దిగి సిబ్బంది వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు. వారికి కనీస భద్రత సౌకర్యాలు లేవు. కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు లాంటివేమీ లేవు. ఇలా వారు డ్రైనేజీలోకి దిగి వ్యర్థాలు శుభ్రం చేయడం వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అసలే కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో వారిలా దుర్గంధం వచ్చే వ్యర్థాలను తొలగించడం.. అదీ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చేయడం సరైనది కాదు. అయితే ఈ కరోనా కాలంలో వారిచేత అధికారులు ఇటువంటి పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది.
గత తెదేపా ప్రభుత్వంలో ఇలాంటి పనుల కోసం యంత్రాలను ఉపయోగించారు. అయితే నేడు మనుషులతోనే వ్యర్థాలను తొలగిస్తున్నారు. వారింత చేస్తున్నా చివరికి వారికిచ్చే వేతనం రోజుకు రూ. 500లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మురుగు తొలగించే పనులను యంత్రాల ద్వారా చేయించాలని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి...