నెల్లూరు జిల్లా కొడవలూరు - అల్లూరు మండలాలను కలిపే రహదారికి ఇరువైపులా... వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఒకప్పుడు పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఆ ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలతో విధ్వంసం సృష్టించారు. క్రమంగా ఆ ప్రాంతమంతా దుమ్మూ ధూళితో నిండిపోయింది. స్థానిక రాజకీయ నేతల అండతో యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అతి తక్కువ కాలంలో వందల ఎకరాలు నాశనం అయ్యాయి.
గ్రావెల్ తవ్వకాలు సృష్టించిన విధ్వంసంతో ఇబ్బంది పడుతున్న ఆ ప్రాంత ప్రజలు రాకపోకలకు ఉన్న ఏకైక మార్గంలో రాళ్లు తేలుతున్న కారణంగా.. మరింత ఆందోళన చెందుతున్నారు. గ్రావెల్ తరలించేందుకు భారీ వాహనాలు అదేపనిగా రాకపోకలు సాగిస్తుండటంతో నార్త్ ఆములూరు, బట్రకాగొల్లు, గొల్లపాళెం వెళ్లే రోడ్డు గుంతలమయం అయిపోయింది. ఇళ్ల స్థలాలకు అనుమతుల పేరుతో ప్రభుత్వ భూమిని 5 మీటర్ల లోతున గ్రావెల్ తవ్వేయగా.. రోడ్డుకు ఇరువైపులా చెరువులా మారిపోయింది. ఇలా అక్రమంగా తవ్వేస్తున్న ఈ గ్రావెల్‌ను... టిప్పర్ లోడు 6వేల రూపాయల చొప్పున రైల్వే పనులకు పెద్దఎత్తున విక్రయించడం విశేషం.
జేసీబీలు, టిప్పర్లతో రాత్రి సమయంలోనూ తవ్వకాలు జరిపి గ్రావెల్ తరలిస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల్లోకి విపరీతంగా మట్టి చేరుతోంది. పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లా, మండల అధికారులు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రావెల్ తవ్వకాలపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు దృష్టి కేంద్రీకరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: