నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో వేలం నిర్వహణాధికారి దేవానంద్ అవినీతికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేస్తూ... అక్రమాలకు పాల్పడుతూ, రైతులను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోయారు. కొంతమంది రైతుల నుంచి నగదు తీసుకొని... వారి పొగాకు బేళ్లకు నాణ్యమైన గ్రేడ్లు ఇచ్చి అధిక ధరలు ఇస్తున్నారన్నారు. నగదు ఇవ్వని రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్యాయాన్ని ప్రశ్నించిన రైతుల పొగాకు బేళ్లను కొనుగోలు చేయకుండా.. లైసెన్సులు రద్దు చేస్తానని బెదిరిస్తున్నారనీ రైతులు ఆరోపించారు. పొగాకు బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న సీజనల్ ఉద్యోగుల నుంచి... ఉద్యోగాల నియామకానికి ఐదు వేల రూపాయల చొప్పున వసూలు చేశారని రైతులు అన్నారు. పొగాకు బోర్డు అందించే 15 వేల ప్రోత్సాహక నగదులో 5 వేల వంతున రైతుల నుంచి బలవంతంగా వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం నిర్వహణ అధికారిపై విచారణ జరిపి.. అధికారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన వేలం నిర్వహణాధికారి దేవానంద్, రైతులు చేసిన ఆరోపణలు ఖండించారు. తను అవినీతి చేసి ఉంటే రైతులు నిరూపించాలని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: నెల్లూరులో కట్టుదిట్టంగా అమలవుతోన్న లాక్డౌన్