Elephants In Chittoor District: అడవుల్లో సంచరించే ఏనుగుల గుంపుల మధ్య అస్తిత్వ పోరాటం సమీప గ్రామాల వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కొన్ని సార్లు ఆధిపత్యం కోసం పోట్లాడుకుంటున్నాయి. అంతే కాక పంట పొలాల్లో దిగి విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి చంద్రగిరి నియోజకవర్గం కందులవారిపల్లి ఉప సర్పంచి, టీడీపీ నేత రాకేశ్ చౌదరిని ఏనుగులు కాళ్లతో తొక్కి చంపిన ఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు కోరుతున్నారు.
ఊరేగింపులో ఏనుగుల బీభత్సం- భక్తుల తోపులాట- అనేక మందికి గాయాలు! - Elephant Fight In Kerala Video
తమిళనాడు టు శేషాచలం అడవులు: గతంలో 10 నుంచి 12 వరకు ఏనుగులున్న గుంపు తమిళనాడు నుంచి పలమనేరు మీదుగా శేషాచలం అడవుల్లోకి ప్రవేశించింది. అయితే ఇవి కౌండిన్య అభయారణ్యం నుంచి శేషాచలం అడవుల్లో సంచరిస్తూ ఉండేవి. కొన్నేళ్లకు మరో 15 ఏనుగుల గుంపు పక్క రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చింది. కాలక్రమంలో వాటి సంతతి పెరిగింది. రెండు గుంపుల మధ్య ఆధిపత్య పోరు జరగడం, ఆహారం, మనుగడ కోసం మందలుగా విడిపోయి అటవీ ప్రాంతాలతోపాటు జనావాసాల వైపు రావడం మొదలైంది.
ప్రస్తుతం కుప్పం, పలమనేరు, పుంగనూరు కేంద్రాలుగా సుమారు 20 ఏనుగులతో ఒక గుంపు, శేషాచలం అడవుల కేంద్రంగా 15 ఏనుగులతో మరో గుంపు తిష్ఠవేసుకుని కూర్చున్నాయి. ఈ రెండు గుంపులూ అటవీ ప్రాంతంలో పరస్పరం తారసపడినప్పుడు తప్పించుకునే క్రమంలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. సమీప పంటపొలాలపై పడుతున్నాయి. వాటిని కాపాడుకోవాలనుకునే క్రమంలో ఎదురెళితే రైతులను, స్థానికులను దారుణంగా వెంటాడి చంపుతున్నాయి.
ఏనుగు దాడుల్లో 22 మరణాలు నమోదు: ఏనుగుల దాడుల కారణంగా 2011 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 22 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు 2018-24 వరకు రూ.5 లక్షల పరిహారం చెల్లించగా కూటమి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందిస్తోంది. 2015-24 మధ్య 233 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అంచనా. ఇందుకు రూ.76.321 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉండగా 2022 వరకు రూ.56 లక్షలు చెల్లించారు.
కౌండిన్య పరిధిలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు వినాయక, జయంత్, తిరుపతి జూలో ఉన్న గణేష్, వెంకన్న, బాలాజీలను ఉపయోగించుకోవడంలో అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తిరుపతి డివిజన్ పరిధిలోని 15 ఏనుగుల గుంపు పంటపొలాలపై దాడులు నిర్వహిస్తోందని తిరుపతి డివిజన్ సబ్ డీఎఫ్‌వో నాగభూషణం అన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్! - Mother Elephant Tearful Moment