Sarah Covenant Home Provides Shelter For Mentally Challenged Children : వారంతా మానసిక వికలాంగులు, తల్లిదండ్రులు లేని అనాథలు. ఉన్నా ఎవరో తెలియని నిర్భాగ్యులు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించి వారిలో మానసిక పరిపక్వత తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది ఒంగోలులో ఉన్నా 'సారా కవనెంట్ హోమ్'. ప్రత్యేక అవసరాల బాలికల సేవలో తరిస్తూ అవసరమైన విభాగాల్లో శిక్షణనిస్తూ వారిలో స్థైర్యాన్ని నింపుతోంది.
అందులో ఒక అమ్మాయి పేరు రిబ్కా. స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కె.కందుకూరు. పుట్టుకతోనే చేతులు రెండు చచ్చుబడి పోయాయి. నడవడం కూడా కష్టమే. తల్లిదండ్రుల నిరాదరణకు గురైన ఈ బాలికను శిశు సంక్షేమ శాఖ గుర్తించి ఒంగోలులోని సారా కవనెంట్ హోమ్‌కు చేర్చింది. ఆశ్రమ సిబ్బంది బాలికకు ఫిజియోథెరిఫి ఇప్పించి కాళ్లలో కొంత శక్తిని కల్పించారు. అంతేకాకుండా చదువుపై ఆసక్తిని పెంచారు. ఇప్పుడీమె కాళ్ల సాయంతో పుస్తకాలు తీయడం, కాలివేళ్ల మధ్య పెన్ను పెట్టుకుని నోట్స్ రాసుకోవడం చేస్తుంది. ఒపెన్ స్కూల్లో పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న రిబ్కా టీచర్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.
తిరుపతిలో దారుణం.. మానసిక విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం
ఒంగోలులో ఉన్న సారా కవనెంట్ హోమ్ 2008లో స్థాపించారు. అమెరికాకు చెందిన రెబ్బవరపు సారా ఒంగోలు వచ్చి స్థిరపడి, ఈ ఆశ్రమం స్థాపించారు. కొంతమంది సిబ్బందిని, కేర్ టేకర్లను నియమించుకుని మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ కమిటీ గుర్తించిన అనాథ, మానసిక వైకల్యం కలిగిన వారిని ఇక్కడ చేరుస్తారు. అందువల్ల వారి పుట్టుపూర్వోత్తరాలు, తల్లిదండ్రుల వివరాలు కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. అలాంటి దిక్కూమొక్కూలేని పిల్లలను ఇక్కడ ఆరోగ్యవంతులుగా తయారు చేయడం, మానసిక పరిపక్వతకు తీసుకురావడం వీరి పని. పూర్తిగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతానికి 40 మంది బాలికలు ఉంటున్నారు. ప్రేమగా వారిలో నైపుణ్యాన్ని గుర్తించి, అందుకు తగ్గ తర్ఫీదు ఇచ్చి ఆదుకుంటున్నారు.
Sexual Abuse : లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..
ఒక్కొక్కరూ ఒకో రకమైన మానసిక స్థితిలో ఉంటారు. కొందరికి మాటలు రావు. మరికొందరు నడవలేరు. ఇంకొందరికి ఇక్కడకు వచ్చేటప్పుడు కనీసం చేతులు, కాళ్లు పనిచేయలేని స్థితిలో ఉంటే వారికి ఫిజయో థెరపి చేసి, నడిచేలా సహకారం అందిస్తారు. ఇద్దరేసి పిల్లలకు ఒక కేర్ టేకర్ ఉంటారు. ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్, వైద్యులు ఇలా నిరంతరం బాలికల సేవల్లో ఉంటారు. ఈ ఆశ్రమంలో చేరిన పలువురిని విదేశీయులు దత్తత తీసుకున్నారు. పలువురు బాలికలు వివిధ రంగాల్లో కాస్తా నైపుణ్యం సాధించి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకూ బాధితులు స్వశక్తితో బతికేలా చేసి, వారిని సాధారణ జీవనంలోకి తీసురావడమే సంస్థ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. కన్నవాళ్లే కాదనుకున్న వారిని అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్న ఆశ్రమ నిర్వాహకులను పలువులు ప్రశంసిస్తున్నారు.
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం.. నిందితుడు అధికార పార్టీ మద్దతుదారుడిగా ప్రచారం !