నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగురు గ్రామంలో ఇళ్ల స్థలాలను... లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు వచ్చిన అధికారులను దళిత కాలనీ వాసులు అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
పూర్వం నుంచి ఆ స్థలం దళితుల శ్మశాన వాటికగా ఉండేదని... అయితే 10 సంవత్సరాల కిందట పొంగూరు గ్రామంలో ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలను మంజూరు చేయడంతో... దళిత కాలనీవాసులు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే కారణంతో.... శ్మశాన వాటికను పాఠశాల ఏర్పాటుకు ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రాంతంలో దళితుల శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా... ఆ పాఠశాల ప్రాంత సమీపంలో ఉన్న స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. అయితే ఆ ప్రాంతంలో ఇళ్లస్థలాలు దళితులకు ఇవ్వకుండా... అధికారులు అగ్రవర్ణాల వారికి కేటాయించారు. దీంతో ఆగ్రహించిన దళిత కాలనీ వాసులు...తహసీల్దారుతో వాగ్వాదానికి దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన తహసీల్దారు సుధాకర్ దళిత మహిళలను అసభ్యకర పదజాలంతో దూషించారు.
అంతేకాకుండా మీకు ఇళ్ల స్థలాలు అగ్రవర్ణాల వారితో సమానంగా ఇవ్వటానికి వీలుపడదని... కావాలంటే ఊరి చివర ఉన్న వాగు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో ఆవేశానికి లోనైన దళిత కాలనీవాసులు ఇళ్ల స్థలాల లే అవుట్ల గుర్తు రాళ్లను తొలగించేశారు. వివాదం చెలరేగే అవకాశం ఉండటంతో.. తహసీల్దారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మర్రిపాడు మండల తహసీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మండలంలో పలు వివాదాలకు తెర లేపుతున్నారు అని మండల ప్రజలు అంటున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదా?: ఎమ్మెల్యే వాసుపల్లి