కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై పార్టీలకతీతంగా గ్రామగ్రామాన ఉద్యమాలను ఉద్ధృతం చేసి చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
"కేంద్ర ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చిన చట్టాలు కార్పొరేట్ సంస్ధలకు అనుకూలంగా ఉన్నాయి. చట్టాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. రైతుల పేరు చెబుతూ కార్పొరేట్ సంస్థలకు స్వేచ్ఛ కలిగించేలా చట్టాలను తయారు చేసింది. చట్టాల వల్ల ధరల నియంత్రణ లేకుండాపోతుంది. ఈ చట్టాలు భవిష్యత్తులో రైతులకు ఉరితాడుగా మారుతాయి". -శ్రీనివాస రావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
ఉచిత విద్యుత్తు అమలు చేస్తే నగదు బదిలీ చేయడం ఎందుకు? అంటూ శ్రీనివాసరావు ప్రశ్నించారు. రైతుల ఖాతాల్లో జమ చేసే నగదు.. ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించవచ్చు కదా అన్నారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తూ తెచ్చిన చట్టాలకు వైకాపా, తెదేపాలు మద్దతు పలకడం దారుణమన్నారు. చట్టాలను వ్యతిరేకిస్తే ప్రధాని మోదీ వారిని జైలుకు పంపుతారని భయపడి ఆమోదం తెలిపారని ఆరోపించారు. వైకాపా, తెదేపాలు రైతుల పట్ల ఆత్మాభిమానం లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఊర్లకు ఊర్లు ఒక్కటై ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి చట్టాల వ్యతిరేక నినాదం దిల్లీకి చేరేలా పోరాటం ముందుకు సాగాలన్నారు.
ఇదీ చదవండి :