నెల్లూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. నిత్యం భారీగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వీరిలో ఉత్సాహం నింపేందుకు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నిత్యం కొవిడ్ కేంద్రాల్లోకి వెళ్తున్నారు. బాధితులను పలకరిస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. పగలు, రాత్రి ఏదో ఒక సమయంలో జీజీహెచ్, నారాయణ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. పీపీఈ కిట్ ధరించి ఐసీయూ వార్డుల్లో కలియతిరుగుతూ వైద్యులు, నర్సులను ఉత్సాహ పరుస్తున్నారు.
కొవిడ్ వార్డుల్లోని ఐసీయూలో ఉన్న బాధితుల చెంతకు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్యం మెరుగవడానికి సూచనలు ఇస్తున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు. యువత సైతం ముందుకు వచ్చి కరోనా బాధితులకు సేవ చేయాలని పిలుపునిచ్చారు జేసీ. జాగ్రత్తలు పాటిస్తూ కొవిడ్ కేంద్రాల్లో సహాయక కార్యక్రమాలను అందించవచ్చని చెబుతున్నారు.
జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌ను పలువురు వైద్యులు కూడా అభినందిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల వైద్యులు, వైద్య సిబ్బంది ధైర్యంగా పని చేయగలరని అంటున్నారు.
ఇదీ చదవండి