CM Jagan in nellore: కలెక్టరేట్, న్యూస్‌టుడే: దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు భర్తీ చేయలేమని.. ఆయన అందరి మనసుల్లో అగ్రస్థానంలో నిలిచిపోయారని సీఎం జగన్ అన్నారు. ఆయన కుటుంబానికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడులో సోమవారం నిర్వహించిన గౌతమ్‌రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.‘‘గౌతమ్ మన మధ్య లేరని అంటే.. నమ్మడానికీ మనసుకు కష్టంగా ఉంది. ఇంకా కనిపిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
నా ప్రతి అడుగులో తోడుగా..
‘నాకు చిన్నప్పటి నుంచి గౌతమ్‌రెడ్డి పరిచయం. మంచి స్నేహితుడు. నేను లేకపోయింటే గౌతమ్ బహుశా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. అప్పట్లో కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీతో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యమే కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాకు అండగా నిలబడేలా చేసింది. ప్రతి అడుగులోనూ స్నేహితుడిగా తోడున్నారు. నాకంటే ఒక సంవత్సరం పెద్దవాడైనా.. నన్నే అన్నగా భావించేవారు. మేమంతా ఉన్నాం.. నువ్వు చేయగలవు అని ప్రోత్సహించేవారు. నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చా. మంచి నాయకుడిగా ఎదిగారు. పరిశ్రమలు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు మంచి పేరు వస్తుందని గౌతమ్ తాపత్రయ పడేవారు. దుబాయ్ సదస్సు నుంచి వచ్చిన తర్వాత కలిసి విషయాలు వివరించేందుకు సమయం కూడా అడిగారు. ఈలోపే ఇలా జరిగిపోయింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.
సంగం బ్యారేజీకి గౌతమ్ పేరు
‘రాజమోహన్‌రెడ్డి కోరినట్టుగా.. ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాలను వ్యవసాయ, ఉద్యాన కళాశాలగా మారుస్తాం. అవకాశముంటే యూనివర్సిటీగా చేస్తాం. గౌతమ్ చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు నీరందిస్తాం. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-2లో ఉన్న ఉదయగిరి, బద్వేలు ప్రాంతాన్ని ఫేజ్-1లోకి తీసుకొచ్చి పనులు వేగవంతం చేస్తాం. మే 15లోపు సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. మంచి రోజు చూసుకుని నేను మళ్లీ వస్తా. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యుల సమక్షంలో ప్రాజెక్టును ప్రారంభిస్తాం. గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలిచేలా ‘మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తాం’’ అని జగన్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు కల్యాణచక్రవర్తి, ఎమ్మెల్యేలు కోటôరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వరప్రసాద్‌రావు పాల్గొన్నారు.
చిన్నప్పటి నుంచి గౌతంరెడ్డి నాకు తెలుసు. నా ప్రతి అడుగులో తోడుగా ఉన్నారు. గౌతంరెడ్డి ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేవారు. పరిశ్రమలశాఖలో 6 విభాగాలను చూసేవారు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని ఎంతో తపన పడేవారు. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేవారు. మంచి వ్యక్తిని, మంచి స్నేహితుడిని కోల్పోయా. మనిషి చనిపోయాక ఎందరి మనసుల్లో ఉన్నారన్నదే ముఖ్యం. సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజ్ పేరు పెడతాం. -.వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి: