ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమవుతున్న వారిలో వెలుగు నింపాలని భావించారు అధికారులు. ఈ ఆలోచనలకు మాజీ మంత్రి నారాయణ తోడయ్యారు. ఇంకేముంది అక్కడ సరస్వతీ నిలయం ఆవిష్కృతమైంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉత్తమ విద్య, అత్యుత్తమ ఫలితాలతో దూసుకుపోతోంది. అదే నెల్లూరు మున్సిపల్ జూనియర్ కళాశాల.
2017లో ప్రారంభం...
అరకొర వసతులతో చదువీడుస్తున్న వారి జీవితాల్లో సంతోషం నిపేందుకు 2017లో నెల్లూరు మున్సిపల్ జూనియర్ కళాశాల పురుడు పోసుకుంది. మొదటి ఏడాది 49 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల ప్రణాళికాబద్ధంగా విద్యను అందించింది. నగరపాలక సంస్థతోపాటు నారాయణ విద్యా సంస్థల తోడుతో విద్యార్థులకు సకల వసతులు కల్పిస్తున్నారు.
ప్రభుత్వ విద్యకే ఆదర్శం...
ఎవరూ ఊహించని ఫలితాలతో దూసుకెళుతుంది ఈ కాలేజీ. మొదటి ఏడాది 49 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 32 మంది 10/10 పాయింట్లు వచ్చాయి. మిగిలిన వారు 9.8 పాయింట్లు సాధించి ప్రభుత్వ కళాశాలలోనే అరుదైన ఘనత సాధించారు. అదే ఒరవడితో ఈ ఏడాది 166 మంది విద్యార్థులు పరీక్ష రాయగా నూటికి నూరుశాతం ఫలితాలు సాధించారు. ఇక్కడ విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన తర్ఫీదునూ ఇస్తున్నారు. ఈ ఏడాది 35 మంది విద్యార్థులు ఐఐటి, జేఈఈ మెయిన్స్ లాంటి పోటీ పరీక్షలకు హాజరు కాగా... 24 మంది అర్హత సాధించారు.
సీటు కోసం పోటీ...
ఈ కళాశాలలో సీటు పొందేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి విద్యార్థులను చేర్చుకోగా, ఈ ఏడాదికి కేవలం నెల్లూరు జిల్లా విద్యార్థులకే అవకాశం కల్పించారు. పేదరికమే ప్రామాణికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఉత్తమ విద్యార్థులకే కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు గానీ, ఆర్థిక స్తోమత బాగుండే పిల్లలను గానీ కళాశాలలో సీటు రాదని కళాశాల డీన్ వెంకట్రావు చెబుతున్నారు. ఈ ఏడాది 120 మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.
సర్కారీ చదువంటేనే భయపడే ఈ రోజుల్లో.. కార్పొరేట్‌ను తలదన్నేలా ముందుకెళుతోంది నెల్లూరు మున్సిపల్ జూనియర్ కళాశాల.
ఇదీ చదవండీ:'ఐ లవ్ యూ వైజాగ్' అంటూ కదిలిన యువత