రెండేళ్ల వైకాపా పాలనలో ఎవరైనా బాగుపడ్డారా ? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా గూడూరులో తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి అవకాశమన్నారు. రాష్ట్రంలో జగన్ బ్రాండ్ మద్యం, నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్నాయన్నారు. సామాన్యుడు సొంతింటి కలను నేరవేర్చుకుందామనుకుంటే.. ఇసుకను అందుబాటులో లేకుండా చేశారన్నారు. పేదలు ఏం పాపం చేశారని అన్న క్యాంటీన్‌లను ఎత్తేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవని, అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపకార వేతనాలు ఆపి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్నారు. రాజకీయాల్లో రూపాయి ఆశించకుండా నిప్పులా బతుకుతున్న తనపై..తప్పుడు కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తిరుపతి సభలో రాళ్లు వేసిన వారిని తప్పించిన పోలీసులు... రాళ్లు వేసిన వారిని తీసుకురమ్మని నాకే చెబుతున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి