నెల్లూరు కేంద్రంగా అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ కోట్లలో జరుగుతూనే ఉంది. మూడేళ్లుగా వందలాది మంది యువత ఈ వ్యసనానికి బానిసలవుతున్నారు. అప్పటి ఎస్పీ రామకృష్ణ బెట్టింగ్ బాబులను గడగడలాడించాడు. కరుడుకట్టిన కృష్ణసింగ్ లాంటి బుకీలను అరెస్ట్ చేశారు. అంతేకాక వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డిని కూడా అరెస్ట్ చేసి సంచలనం స్పష్టించారు. ముంబయి, చెన్నై, హైదరాబాద్, గోవా ప్రాంతాల్లోని క్రికెట్ గ్యాంగ్‌లతో సంబంధాలు కొనసాగిస్తున్న 15మంది బుకీలను... పంటర్లుగా ఉన్న 400మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన బదిలీ అయినప్పటి నుంచి క్రికెట్ బెట్టింగ్‌లు మళ్లీ జోరందుకున్నాయి.
లక్షలు నష్టపోయినా.. మారని బుద్ధి
తాజాగా ఇంగ్లండ్ మ్యాచ్‌కు పందెం కాసిన ఇద్దరిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసారు. వీరు ఊటుకూరు వెంకటరమేష్, ఖాదర్ నవాజ్లుగా పోలీసులు గుర్తించారు. గతంలోనూ వీరిపై బెట్టింగ్ కేసులు ఉన్నప్పటికీ బుద్ది మార్చుకోలేదు. దీని వల్ల వీరు లక్షల రూపాయల విలువైన ఆస్తులను కోల్పోయినా పందేలు పెట్టడం మానుకోలేదని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన ఇద్దరు క్రికెట్ బుకీల వద్ద ఉన్న చరవాణిలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చెన్నై కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ లు వేస్తున్న వారి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్రికెట్ బుకీల కోసం గాలిస్తున్నారు.