నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలోని దూబగుంటలో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన చల్లా వెంకస్వామి, నారమ్మ తమకున్న మూడెకరాల భూమిలో గత కొన్నాళ్లుగా నిమ్మతోటను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది బోర్లలో నీరు లేక నిమ్మ తోటలోని చెట్లు ఎండిపోయాయి. అనంతరం అదే భూమిలో రైతు వెంకట స్వామి అప్పు చేసి మరీ పత్తి పంట వేశాడు. నీరు లేక ఆ పంటలోనూ నష్టం వచ్చింది.
చిన్నప్పటి నుంచి వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న వారికి అదే వ్యవసాయంలో వరుసగా నష్టాలు వస్తుండటంతో తట్టుకోలేకపోయారు. అసలే వృద్ధాప్యం, ఆపై అప్పులు తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వృద్ధ దంపతులు తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. పొలంలోనే పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: