Parents Complaint on Son: కుమారుడు వేధింపులను భరించలేక వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో చోటు చేసుకుంది. అనంతసాగరంలో నివసిస్తున్న వృద్ధదంపతులు జిలాని, మస్తాన్ బీలు కుమారుడి నిరాదరణకు లోనయ్యారు. కానీ కువైట్లో ఉంటున్న మరో కుమారుడు మాత్రం తాను సంపాదిస్తున్న మొత్తంలో తల్లిదండ్రులకు పోషణకు ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తున్నాడు. స్థానికంగా ఉండే మరో కుమారుడు షబ్బీర్ పెళ్లి చేసుకుని వేరే కాపురం ఉంటున్నాడు.
తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుడు..: షబ్బీర్ మాత్రం తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. కువైట్లో ఉంటున్న సోదరుడు డబ్బులు పంపుతుండటంతో ఆ ఇంటిని తల్లిదండ్రులు ఎక్కడ అతనికి రాసిస్తారోనని అనుమానం పెంచుకున్నాడు. వేరే దగ్గర అద్దెకు ఉంటున్న ఇంటిని వదిలేసి వృద్ధ తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటున్నాడు. అప్పటినుంచీ తల్లిదండ్రులను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. తరచూ గొడవలకు కారకుడై ఆవేశంతో తండ్రిపైనే దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఏకంగా తల్లిదండ్రులను వీధిపాలు చేయడానికి ప్రయత్నించడంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.
కొడుకుపైనే ఫిర్యాదు ..: అనంతసాగరంలో నివసిస్తున్న షబ్బీర్.. తండ్రి జిలానిపై ఇటీవల దాడి చేశాడు. దాంతో వెన్నుపూస విరిగి జిలాని లేవలేని స్థితికి చేరుకున్నాడు. తమను చీటికి మాటికీ వేధిస్తున్నాడని వృద్ధులైన తల్లిదండ్రులు ఏకంగా కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు షబ్బీర్ నుంచే వేధింపులు అధికమయ్యాయి. దానికితోడు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లాలని ఒత్తిడి చేయడంతో జిలాని వృద్ధదంపతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చివరకు కుమారుడు షబ్బీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లి మస్తాన్ బీ ఆవేదన వర్ణనాతీతం..: ఇంట్లో నుండి బయటకు వెళ్లాలని తరచూ కొడుకు, కోడలు వేధిస్తున్నారని తల్లి మస్తాన్ బీ ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కనీసం పట్టించుకోని కొడుకు.. వేధింపులకు గురి చేస్తున్నాడని వారు ఆవేదనభరితులవుతున్నారు. పెళ్లి చేసుకొని ఇన్నాళ్లు వేరే ప్రాంతంలో ఉంటూ.. ఇప్పుడు ఇంట్లో తిష్టవేసి బాధలు పెడుతున్నాడని కన్నీరుమున్నీరయ్యారు.
ఆలనాపాలనా చూస్తున్న సోదరుడిపై అనుమానం..: కువైట్లో ఉన్న మరో కొడుకు వృద్ధ దంపతులకు డబ్బులు పంపుతూ ఆలనాపాలనా చూస్తున్నాడు. దూరంగా ఉన్నా కొడుకుగా తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. వృద్ధదంపతుల జీవనానికి డబ్బులు పంపిస్తూ ఇతరత్రా మంచి చెడు చూస్తున్నాడు. ఇంత చేస్తున్న కువైట్లో వున్న సోదరుడికి వారు ఉంటున్న ఇల్లు రాసిస్తారన్న షబ్బీర్లో అనుమానం పెనుభూతంగా మారింది.
అసహనంతోనే తల్లిదండ్రులకు వేధింపులు..: అంతటితో ఊరుకోకుండా ఇక్కడున్న కుమారుడు షబ్బీర్ అసహనం పెంచుకుని తల్లిదండ్రులను వేధించడం ప్రారంభించాడు. ఆ ఇంటిని ఎక్కడ కువైట్లో ఉన్న సోదరుడుకి రాసిస్తారోనన్న దుగ్ధతో వృద్ద దంపతులను కష్టాలకు గురి చేస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలని తరచు సతాయిస్తున్నాడని వృద్ధ దంపతులు వాపోతున్నారు. కొడుకు కోడలు వేధింపులు తాళ లేక తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు పోలీసుల శరణు వేడారు. ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావుని కలుసుకుని కుమారుడు కోడలిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వృద్ధ దంపతులకు న్యాయం చేస్తామని సీఐ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి