నెల్లూరు జిల్లా నవలాకులతోట వద్ద ఈ నెల 9న జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతోనే ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ వెల్లడించారు.
అనుమానంతోనే..
విడవలూరు మండలానికి చెందిన నాగేశ్వరరావు, నిర్మలమ్మల దంపతులు గత కొంత కాలంగా నవలాకులతోట నాలుగో మైలు వద్ద నివాసముంటున్నారు. అనుమానంతో గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య నిర్మలమ్మతో పాటు ఆమెకు సహకరిస్తోందన్న అనుమానంతో వెంకటరత్నమ్మను నాగేశ్వరరావు గొంతు కోసి హతమార్చాడు.
మృతదేహాలతో పాటే నిద్ర...
రెండు రోజులపాటు మృతదేహాలు ఉన్న ఇంట్లోనే నాగేశ్వరావు కూడా ఉంటూ అక్కడే నిద్రించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జంటహత్యల విషయం బయటపడటంతో రూరల్ పోలీసులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను చంపినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి విరమించుకున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : వివాహిత బలవన్మరణం.. భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు