amaravathi farmers: నెల్లూరు జిల్లాలో రైతు మహా పాదయాత్ర సమరోత్సాహంతో సాగుతోంది. పాదయాత్రలో జై అమరావతి నినాదాలు హోరెత్తుతున్నాయి. 35వ రోజు గూడూరు నియోజకవర్గం పుట్టంరాజు కండ్రిగ నుంచి యాత్ర ప్రారంభించిన అన్నదాతలు.. గొల్లపల్లి, వెంకటరెడ్డి పల్లి, అంబలపూడి, బాలాయపల్లి, యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకోవడంతో ఈ రోజు యాత్ర ముగిసింది. పాదయాత్ర పొడవునా రైతులకు పల్లె ప్రజలు అడుగడుగునా పట్టంకట్టారు.
మండుటెండ ఇబ్బంది పెడుతున్నా.. మహిళలు, అన్నదాతలు చెక్కు చెదరని సంకల్పంతో ముందుకు సాగారు. రాజధాని రైతులు చేసే పాదయాత్ర తమ స్వార్ధం కోసం కాదని.. రాష్ట్రం బాగు కోసమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. పుట్టంరాజు కండ్రిగ గ్రామంలో రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. ఒక రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు.
చెన్నై తెలుగుసంఘం నుంచి వచ్చిన 150 మంది ప్రతినిధులు అన్నదాతలకు సంఘీభావం తెలిపారు. రైతులు, ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి వారికి మద్దతు తెలిపేందుకు వచ్చామని వెల్లడించారు. 35వ రోజు యాత్రకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. శనివారం బౌన్సర్లపై జరిగిన దాడి, తదితర పరిణామాలతో వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావును బందోబస్తు విధులకు దూరం పెట్టారు.
ఇదీ చదవండి: