![venkannapalem, nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-nlr-02-03-ellapattalu-no-raja-av-ap10134_03102020140142_0310f_1601713902_674.jpg)
ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నందుకు తమను గ్రామంలోని కొద్దరు పెద్దలు మానసిక క్షోభకు గురిచేస్తున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాళెం ఎస్సీ కాలనీలోని 10 కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్ల కోసం తహసీల్దారు స్థలాన్ని గుర్తించగా గ్రామంలోని కొందరు స్వార్థంతో అడ్డుకోవడమే కాకుండా కోర్టులో కేసు వేశారన్నారు. అంతేకాకుండా తమ కుటుంబాల వారిని వెలివేశారని, తమతో ఎవరైనా మాట్లాడితే 3 వేల రూపాయలు జరిమానా అని ప్రకటించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
వెంకన్నపాళెం గ్రామంలో సర్వే నెంబర్ 131లో 5.88 ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాలను పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు లే అవుట్ చేశారు అధికారులు. దీనిని జీర్ణించుకోలేని ఓ వర్గం.... ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న తమను వేధిస్తోందని బాధితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ భూమి తమకు దక్కకుండా కోర్టులో కేసులు వేశారని వెల్లడించారు. తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ... శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తమ సమస్యపై స్పందించాలని బాధితులు కోరుతున్నారు.