Purandeswari Fire on Tidco Housing Structures: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టిడ్కో గృహా నిర్మాణాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడ్కో గృహాల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు అందలేదని దుయ్యబట్టారు. ల్యాండ్, శ్యాండ్, వైన్‌తో జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుంటోందని పురందేశ్వరి ధ్వజమెత్తారు.
Purandeshwari visit in Manyam District: రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె అడ్డాపుశీల వద్ద వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో గృహా నిర్మాణాలను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా గృహ సముదాయానికి వెళ్లే రోడ్డు మార్గం దుస్థితిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం టిడ్కో గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పురందేశ్వరి మండిపడ్డారు. పార్వతీపురంలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇళ్లు అందలేదని ఆమె గుర్తు చేశారు.
ఏపీలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు - వైసీపీ కుంభకోణాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి : పురందేశ్వరి
Purandeshwari Comments: ''వైఎస్ జగన్ ప్రభుత్వం 2018లో టిడ్కో గృహా నిర్మాణాలను ప్రారంభించింది. 2020కల్లా లబ్ధిదారులకు అందివ్వాలి. కానీ, 2023 దాటిపోతున్నా ఇప్పటివరకూ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేదు. పోనీ, ఎప్పుటికీ ఇస్తారని అడిగితే మరో రెండు నెలల్లో అందిస్తామంటూ అధికారులు సమాధానాలు చెప్తున్నారు. అయితే, అక్కడ ఇప్పటికీ కరెంట్ పనులు, కనీస మౌలిక సదుపాయాలు, ప్లంబింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. మెయిన్ రోడ్డు నుంచి ఆ టిడ్కో ఇళ్లకు వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ దోపిడీయే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పాలన నడుస్తుంది.'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.
Purandeshwari on Central Funds: కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పురందేశ్వరి గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనేనని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రత్యక్షత చూపుతుందన్న ఆమె, రాష్ట్రంలో రహదారుల అధ్వానంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. మన్యం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 1,66,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం ఉన్నప్పటికీ, ఏళ్లు గడుస్తోన్న పూర్తిస్థాయి ఆశయం నెరవేయడం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్రా' అంటూ హడావిడి చేస్తోంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం జరగలేదు. ల్యాండ్, శ్యాండ్, వైన్‌తో రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటోంది. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైసీపీలో హయంలో అంతా అవినీతి, అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. - పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు